ప్రముఖ సినీనటుడు మిథున్ చక్రవర్తి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ముంబై నగర పాలక సంస్థ అయిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆయనకు చెందిన మలాడ్ ప్రాంతంలోని ఆస్తి పై అనుమతులేని నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించి, ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసింది. మే 10న పంపిన ఈ నోటీసులో అనేక వివరాలు పేర్కొన్నారు.
బీఎంసీ నివేదిక ప్రకారం, మిథున్ చక్రవర్తి ఆస్తిలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ‘మెజనైన్ ఫ్లోర్’ అనే మధ్య అంతస్తును కూడా నిర్మించారని తెలుస్తోంది. మెజనైన్ ఫ్లోర్ అనేది సాధారణంగా రెండు అంతస్తుల మధ్య ఏర్పాటు చేసే తాత్కాలిక అంతస్తు. దీనికి సంబంధించి మున్సిపల్ అనుమతులు తీసుకోకుండా నిర్మాణం చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఇంతటితో ఆగకుండా, సుమారు 10x10 అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక నిర్మాణాలు మూడు నిర్మించట్టు బీఎంసీ గుర్తించింది.
బీఎంసీ ఈ నిర్మాణాలను తక్షణమే తొలగించాల్సిందిగా మిథున్ చక్రవర్తిని హెచ్చరించింది. లేకపోతే, ముంబై మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 475A ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సెక్షన్ ప్రకారం, అనధికారిక నిర్మాణాలను తొలగించనప్పటికీ, సంబంధిత వ్యక్తిపై శిక్షా చర్యలు తీసుకునే అధికారం మున్సిపల్ సంస్థకు ఉంది. ఈ పరిణామం సినీ ప్రపంచంతో పాటు రియల్ ఎస్టేట్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మిథున్ చక్రవర్తి ఇంకా దీని పై స్పందించాల్సి ఉంది.

0 Comments