దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్స్: ఎన్టీఆర్ VS ఆమిర్

 


ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్స్ ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫాల్కే బయోపిక్‌ పై ఒకేసారి రెండు బిగ్ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటుండటం గమనార్హం. ఒకవైపు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా, మరోవైపు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించే చిత్రం సినీ వర్గాల్లో హాట్ డిబేట్‌కు దారి తీస్తోంది.

కొంతకాలం క్రితం లెజెండరీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్‌తో ఒక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా మూవీకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనుండగా, రాజమౌళి కుమారుడు కార్తికేయ, నిర్మాత వరుణ్ గుప్తా కలిసి నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కథ వినగానే ఆకర్షితుడైన తారక్, ఫైనల్ స్క్రిప్ట్‌ను కూడా ఓకే చేసినట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్ మరో విభిన్న పాత్రలో కనిపించనున్నాడన్న వార్తలు అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే, మరోవైపు బాలీవుడ్ వర్గాల్లో ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ కూడా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌పై పనిచేస్తున్నట్టు వార్తలు వెలుగుచూస్తున్నాయి. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించనున్నారని, గత నాలుగేళ్లుగా స్క్రిప్ట్ పనులు సాగుతున్నట్టు సమాచారం. అక్టోబర్ 2025లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు వినికిడి. బ్రిటిష్ రాజ్యంలో సినిమాలు ఎలా పుట్టుకుపోయాయి? ఫాల్కే భారతీయ సినిమా అభివృద్ధికి ఏ విధంగా బడకట్టారు? అనే అంశాలను హిరాణీ తనదైన శైలిలో ప్రెజెంట్ చేయనున్నారని సమాచారం. పైగా ఈ సినిమాకి హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ సపోర్ట్, ఫాల్కే మనవడికి మద్దతు ఉండటం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.

ఈ నేపథ్యంలో దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఒకేసారి రెండు సినిమాలు తెరకెక్కడం సినిమా లవర్స్‌కు ఓ పెద్ద విందే కానీ, కమర్షియల్ పరంగా ఇది మేకర్స్‌కి కాస్త సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రెండు భిన్న శైలుల్లో, భిన్న కథనాలతో తెరకెక్కే ఈ ప్రాజెక్టులు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయో.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను నమోదు చేస్తాయో చూడాల్సిందే. 

Post a Comment

0 Comments